ఒక్కసారి ఆలోచించండి…
మనమందరం ఎంచుకునే దారుల్లో
ఏది నిజంగా “సరైనది” అని
ఎవరు నిర్ణయిస్తారు?
మనమా…?
సమాజమా…?
లేక పరిస్థితులా…?
చాలాసార్లు మనం నమ్మేది
సరైనదే అనిపిస్తుంది…
కాని కాలం గడిచాకే
అది నిజంగా సరైందో కాదో తెలుస్తుంది.
ఎందుకంటే,
“సరైన దారి” అనే దానికి వెంటనే సమాధానం ఉండదు…
కాలమే ఆ నిర్ణయాన్ని నెమ్మదిగా వెల్లడిస్తుంది.
అయినా కూడా జీవితం మన ముందుకు రెండు మార్గాలు తీసుకొస్తుంది…
“ఎలాగైనా బతికేద్దాం…” అనుకునే వారికి జీవితం అంత కష్టం కాదు.
ఎదురొచ్చిన పరిస్థితికి తగ్గట్టు మారిపోతారు…
నీళ్లలా ఏ పాత్రలో పోసిన ఆ ఆకారమే తీసుకుంటారు.
కాని…
“ఇలాగే ఉండాలి…” అని ఒక విలువలతో జీవించాలనుకునే వారికి
ప్రతి రోజు ఒక పరీక్షలా మారుతుంది.
వాళ్లు గాలికి వంగే గడ్డి కాదు…
తుఫాన్నే ఎదుర్కొనే వేరు గట్టిగా పాతుకున్న చెట్టు.
వాళ్లు ఎక్కడ పడితే అక్కడ ఎగిరే ధూళి కాదు…
అగ్నిలో కాలిన తర్వాతే మెరుస్తున్న బంగారం.
వాళ్లు switch మీద ఆధారపడే వెలుగు కాదు…
తానే కరిగిపోతూ వెలిగే దీపం.
మేఘాలు వస్తాయి… పోతాయి…వాటి దారి గాలే నిర్ణయిస్తుంది.
కాని నక్షత్రం మాత్రం తన స్థానం వదలదు…అది తన వెలుగుతోనే నిలుస్తుంది
విలువలకు కట్టుబడిన వాళ్లు …
తమ స్థానం విడిచిపెట్టని నక్షత్రాలు లా స్థిరం గా ఉంటారు.
సత్యం ఏమిటంటే…
విలువలతో జీవించడం అంటే
“ఇది సరైనదే” అని ఖచ్చితంగా తెలిసి ఎంచుకోవడం కాదు…
తెలియకపోయినా,
సందేహాల మధ్యలో కూడా,
మనసు ఎదుట నిలబడగలిగే దారిని ఎంచుకోవడం.
అది కొన్నిసార్లు ఒంటరితనం ఇస్తుంది…
కొన్నిసార్లు నష్టాలు కూడా ఇస్తుంది…
కాని చివరికి
అది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
బతికేవారు చాలా మంది ఉంటారు…
కాని నిజంగా జీవించేవారు కొద్దిమందే.
ఎందుకంటే,
బతకడం అంటే పరిస్థితులకు తగ్గట్టు మారిపోవడం…
జీవించడం అంటే మన విలువలకు తగ్గట్టు నిలబడటం.
కాని ఇక్కడ ఒక సత్యం ఉంది…
మనకు అనిపించినది “సరైనదే” అని
ఎవ్వరూ వెంటనే నిర్ధారించలేరు.
కొన్నిసార్లు మనమే తప్పు కావచ్చు…
కొన్నిసార్లు ప్రపంచమే తప్పు కావచ్చు.
అందుకే,
నిర్ణయం తీసుకునే ధైర్యం మనదైతే,
దానికి అర్థం చెప్పే బాధ్యత కాలానిదే.
మన పని ఒకటే…
ప్రతి సందేహం మధ్యలో కూడా
మనసు ఎదుట నిలబడగలిగే దారిని ఎంచుకోవడం.
ఎందుకంటే చివరికి..
మన నిర్ణయాలను ప్రపంచం కాదు…
కాలమే తీర్పు చెబుతుంది.
ప్రేమతో,
శ్వేత విష్ణుచిత్తన్
Comments
Post a Comment