మేమంతా ఒక సినిమా చూస్తూ ఆసక్తిగా మునిగిపోయాం. కథలో, ధర్మాన్ని కాపాడేందుకు పోరాడుతున్న హీరో ఒక్కడు. విలన్లు భారీ ఆయుధాలతో ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు, కానీ హీరో చేతిలో కేవలం ఒక త్రిశూలం లాంటి సామాన్యమైన ఆయుధం మాత్రమే.
With deep involved ..చూస్తున్న నా కొడుకు నన్ను ఆశ్చర్యంగా అడిగాడు, "అమ్మా, ఇతను ఈ చిన్న ఆయుధంతో ఎలా ఈ రాక్షసులను ఓడిస్తాడు?"
సినిమాలో నేను అంతగా లీనమై, వెంటనే స్పందించాను, "బలం ఆయుధంలో ఉండదు… దాన్ని పట్టిన వాడిలో ఉంటుంది!"
ఆ మాట నాకెందుకో లోపల ఏదో ఆలోచనను రేకెత్తించింది. ఒక్కసారిగా ఆగిపోయి లోతుగా తర్కించాను. నిజంగా, ఇదేనా అన్ని మహాకావ్యాల సారం? నిజమైన శక్తి మన దగ్గర ఉన్న ఆయుధాల్లో కాదు, మన విశ్వాసంలో, మన నమ్మకంలో, మన ధైర్యంలో ఉంది.
గాండీవం అర్జునుని చేతిలో ఉన్నందుకే ధర్మానికి సహాయపడింది. సుదర్శన చక్రం శ్రీకృష్ణుని జ్ఞానానికి లోబడి ధర్మరక్షణ చేసింది. హనుమంతుడు తన శక్తిని గుర్తించక ముందు సాధారణ వానరుడే… కానీ నమ్మకం కలిగిన క్షణమే అతను అపరమిత శక్తి పొందాడు.
సుదర్శన చక్రం ఎందుకు కేవలం ఒక చక్రం కాదు? గాండీవం ఎందుకు సామాన్య ధనుస్సు కాదు? ఎందుకు అదే ఆయుధాలు ఇతరుల చేతిలో అర్థరహితం, కానీ శ్రీకృష్ణుడు, అర్జునుడు వాటిని పట్టినప్పుడు శక్తివంతమైనవి అయిపోతాయి?
బలం ఆయుధంలో ఉండదు… దాన్ని పట్టే వాడిలో ఉంటుంది.
బలం అంటే ఏమిటి? అది ఆయుధమా? సైన్యమా? లేక ఆయుధాన్ని పట్టిన మనిషి లో ఉన్న నమ్మకమా?
ఒక ఆయుధం తాను ఒంటరిగా ఏమీ చేయలేదు. అది ఎవరిని రక్షించాలో, ఎవరిపై ప్రయోగించాలో తెలిసిన వ్యక్తి చేతిలో ఉన్నప్పుడే దానికి అసలు అర్ధం ఉంటుంది.
భగవాన్ శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం ధర్మాన్ని నిలబెట్టింది. అర్జునుడి చేతిలో గాండీవం రాజ నీతిని రక్షించింది. ఒక సామాన్యుడి చేతిలో అవి కేవలం వస్తువులే, కానీ ధర్మాన్ని పట్టిన వీరుడి చేతిలో అవి శక్తివంతమైన సాధనాలు.
ఇది మన చరిత్ర చెబుతున్న గొప్ప గుణపాఠం—బలం మన దగ్గర ఉన్న ఆయుధాల్లో కాదు… మన దృఢ సంకల్పంలో ఉంది.
హనుమంతుడి కథ గుర్తుందా? అపారమైన శక్తి ఉన్నా, తాను ఆ శక్తిని గుర్తించలేకపోయాడు. కానీ జాంబవంతుడు గుర్తు చేసిన క్షణంలోనే, అతడిని ఆపగల శక్తి ఈ భూమిపై ఎవరికీ ఉండదు. హనుమంతునికి బలం తన బాహుబలంలో కాదు… తనపై నమ్మకంలో ఉంది.
ఒక దీపం గురించి ఆలోచించండి. ఒక మహాజ్ఞాని చేతిలో అదే దీపం జ్ఞానాన్ని వెలిగించగలదు. అదే అజ్ఞాని చేతిలో అయితే అడవిని కాల్చివేయగలదు. అందుకే బలం ఆయుధంలో కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదిలో ఉంది.
ఖడ్గం లో శక్తి లేదు, యోధుడి ధైర్యంలో ఉంది. మాటలలో శక్తి లేదు, అవి చెప్పే మనసు లోని నమ్మకంలో ఉంది. మన దగ్గర ఉన్న సాధనాల్లో కాదు, వాటిని ఉపయోగించే వివేకంలో నిజమైన బలం ఉంటుంది.
నన్ను ఆశ్చర్యంగా చూస్తున్న నా కొడుకిని చూసి ఈ సారి మరింత స్పష్టతతో చెప్పాను, "మన చేతుల్లో ఏది ఉందో కాదు, మన మనసులో ఉన్న ధైర్యమే నిజమైన బలం."
ఆ క్షణంలో నాకర్థమైంది… కొన్నిసార్లు మనం అనుకోకుండా చెప్పే చిన్న మాటలే జీవితంలోని లోతైన సత్యాలను మనకు తెలియజేస్తాయి.
నీ బలాన్ని గుర్తించు… దాన్ని సరిగ్గా వినియోగించు… అదే నిజమైన శక్తి.
With ❤
Swetha Vishnuchittan
100% true sister. 👏👏👏👏
ReplyDeleteThanks for the comment, Anna
ReplyDelete